కుత్బుల్లాపూర్, జనవరి 23: ‘తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ, ఆంధ్ర పార్టీకి తెలంగాణలో ఏం పని? చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో ఏం దాయబెట్టిండ్రు, మళ్లెందుకు తెలంగాణకు వస్తున్నరు? మా తెలంగాణలో మాపై మీ ఆధిపత్యం రుద్దడమేమిటి? మేమేమైనా లేనోళ్లమా? లేకిడోళ్లమా?’ అని తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ వెనకి పోనివ్వబోమని, ఆంధ్ర పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వం, సంస్కృ తిని కాపాడుకోవడానికి జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని, తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్లను వ్యతిరేకించాలని సూచించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో టీయూడబ్ల్యూజే యూనియన్ నిర్వహించిన సమావేశంలో ఆయన ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి రవీంద్రభారతిలో పెట్టడం ఏమిటని మండిపడ్డారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతున్నట్టు కొన్ని సమావేశాలు జరుగుతున్నాయని, ఎందుకీ సమావేశాలు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ తిరకాసును గమనించాల్సిన బాధ్యత జర్నలిస్టులదేనని పేర్కొన్నారు. ‘పవన్‌కల్యాణ్ ఇక్కడ ఎందుకు పోటీ చేయాలి? మా ఊళ్లలో పోటీ చేయడానికి నువ్వు ఎవరు? నీ ఊరు నీకుండగా.. మా ఊరు ఎందుకు వస్తున్నావు?’ అని నిప్పులుచెరిగారు. ‘మీ రుద్దుడు 60 ఏండ్లు అనుభవించి, అనుభవించే కొట్లాడినం, మళ్లీ ఈ రుద్దుడు ఎందుకు?’ అని నిలదీశారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని, ఇకడి వనరులు, సంప్రదాయాలపై ఇతరుల ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ‘ఎన్టీఆర్‌ను మేం ఎందుకు పొగడాలి? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మాకెందుకు?’ అని నిలదీశారు. ‘మా గద్దర్, మా అందెశ్రీని మేం పొగుడుకుంటం. 10 ఏండ్లు అయిపోయాక మళ్లీ మీ పెత్తనం ఏమిటి?’ అని అల్లం నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ వనరుల దోపిడీపై అప్రమత్తం: క్రాంతికిరణ్
తెలంగాణ స్వభావాన్ని కోల్పోతే మన ఉనికికే ప్రమాదమని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో పార్టీలన్నీ విడిపోయి ఉన్నా, తెలంగాణ కోసం అందరినీ ఏకంచేసిన ఘనత తెలంగాణ జర్నలిస్టు ఉద్యమానికి ఉన్నదని గుర్తుచేశారు. తెలంగాణ వనరులను దోచుకున్న వారిని హీరోలుగా పొగడటం, ఎన్టీఆర్ వంటి వారిని ఇకడ కీర్తించడం భవిష్యత్‌లో పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిని అడ్డుకోవడానికి ప్రతి ఒకరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులదే కీలక భూమిక అని గుర్తుచేశారు.
ఆంధ్ర పార్టీలు కుట్రలతో తెలంగాణను వెనక్కి తీసుకపోయే ప్రయత్నం చేస్తున్నాయని, జర్నలిస్టులు జాగ్రతతో ఉండి ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో మరెకడా లేనివిధంగా సంక్షేమనిధి, ఆక్రెడిటేషన్లు సాధించుకుని తెలంగాణ జర్నలిస్టుల హకుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం అల్లం నారాయణ అధ్యక్షుడుగా ఉన్న టీయూడబ్ల్యూజేదేనని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు రమేశ్ హజారి, టెమ్జూ అధ్యక్ష కార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి, రమణకుమార్, నేతలు యోగానందం, అవ్వారి భాసర్, తిరుపతి నాయక్, రంగు వెంకటేశ్‌గౌడ్, శివాజీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొలిపాక వెంకట్ తదితరులు పాల్గొన్నారు.