హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం కమిషన్ ఎదుట తన పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్‌కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కమిషన్ విచారణకు హాజరైన మాజీమంత్రి ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం, రీడిజైన్ అంశాలపై మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి వద్ద నెలకొన్న అంశాలపై అధ్యయనం కోసం అప్పటి సీఎం కేసీఆర్ హరీశ్‌రావు చైర్మన్‌గా వేసిన క్యాబినెట్ సబ్‌కమిటీలో తనతోపాటు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని తెలిపారు.
ఆ కమిటీ నిర్ణయం మేరకే ప్రాజెక్టు రీడిజైన్ చేశారని ఈటల వెల్లడించారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. క్యాబినెట్ సబ్‌కమిటీ కేవలం అన్ని ప్రాజెక్టుల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించింది కాదని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పీసీ ఘోష్‌కు విజ్ఞప్తి చేశారు.