హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విత్తన బిల్లు ముసాయిదా రాష్ర్టాల హక్కులను హరించేలా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయశాఖ కేంద్ర విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రాష్ట్రస్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయంపై రాష్ట్రాలకే అధికారం ఉన్నదని చెప్పారు. కానీ ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నీ కేంద్రానికి వెళ్తాయని తెలిపారు. రైతులు నష్టపోయినప్పుడు వారికి నష్టపరిహారం ఇచ్చే అంశం ఈ చట్టంలో లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రైతులను కంపెనీలు మోసం చేస్తున్నప్పుడు, వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పుడు వారిని ఆదుకోవటానికి అవసరమైన సవరణలను ఈ చట్టంలో ప్రతిపాదించాలని సూచించారు.
ఈ ముసాయిదా చట్టంపై శాసనసభలో చర్చిస్తామని తెలిపారు. ముందుగా విశ్వవిద్యాలయం ఉపకులపతి అల్దాస్ జానయ్య మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్రం ఒక మోడల్ చట్టాన్ని తీసుకురావాలని, దాని పరిధిలో రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనువైన చట్టాలు రూపొందించుకునే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదాపై రాష్ట్ర, జిల్లా స్థాయిలో అభిప్రాయాలు సేకరిస్తున్నామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి దండా రాజిరెడ్డి మాట్లాడుతూ.. విత్తన లేబుల్‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రించడం, నర్సరీల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి వంటి అంశాలు ఆహ్వానించదగినవని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చట్టం తీసుకొని రావాలని రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సూచించారు. రైతులకు నష్ట పరిహారం నిబంధనలు స్పష్టంగా ఉండాలని, అలాగే శిక్షలు కఠినంగా ఉండేలా చట్టం ఉండాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ సీడ్స్ కార్పొరేషన్ రైతు కమిషన్ ప్రతినిధులు, వ్యవసాయం, విత్తనరంగ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ) : హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ తక్షణమే ఆర్టీసీలోని గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి లేబర్ కమిషనర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఎన్నిసార్లు లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. హైకోర్టు ఆదేశాలిచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా ఎన్నికలు జరుపకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. ఆర్టీసీలో యూనియన్లను అనుమతించనందునే వేతన సవరణ సమస్యలు మిగిలిపోయాయని చెప్పారు.