వనపర్తి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అబద్ధాలు వల్లించారు. రైతు భరోసా పడుతున్నదని, రైతులకు పూర్తిగా బోనస్ ఈ రోజు పడిపోయిందని ప్రసంగించారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌పాం కంపెనీ నిర్మాణ పనులకు తుమ్మల భూమి పూజ చేసిన అనంతరం అక్కడే రైతులతో మాట్లాడారు. ఏడాదిలోపు రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని తెలిపారు. రైతు భరోసా ఇస్తున్నామని, బోనస్ కూడా పూర్తిగా ఈ రోజు పడిపోయిందని చెప్పారు. తీరా చూస్తే.. ఒక్క వనపర్తి జిల్లాలోనే రూ.23 కోట్ల బోనస్ రెండు నెలలకుపైగా పెండింగ్‌లో ఉన్నట్టు శనివారం సాయంత్రం నాటి ఆన్లైన్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. మంత్రి మాటను విన్న పలువురు రైతులు సభాస్థలిలో గుసగుసలాడుకోవడం కనిపించింది.
నా వద్ద డబ్బుల్లేవని టికెట్ లాక్కున్నారు : చిన్నారెడ్డి
తన వద్ద డబ్బులు లేవని వచ్చిన ఎమ్మెల్యే టికెట్‌ను లాక్కున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. గతంలో వేలల్లోనే ఎన్నికలకు ఖర్చు ఉండేదని, ఇప్పుడు కోట్లకు చేరిందని పేర్కొన్నారు.