హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): టీటీడీ నుంచి ప్రభుత్వానికి సొమ్ము అందుతుందనడం అవాస్తవమని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా ఉన్నదని, అందులోనే విరాళాలు జమవుతాయని వివరించారు. ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకే శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్ దర్శన టికెట్ల సంఖ్యను 1000కి తగ్గించామని చెప్పారు. కానీ శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి 50 శాతం నిధులను టీటీడీ జనరల్ అకౌంట్కు బదిలీ చేస్తున్నారని, ఆదాయం కోసమే శ్రీవాణి ట్రస్టుకు దర్శన టికెట్లు ఇస్తున్నారని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలోనూ నిర్మాణాలు
హిందూ ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి)ను 2019లో ఏర్పాటు చేసినట్టు ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు శ్రీవాణి ట్రస్టు నిధులతో 2,068 ఆలయాల నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. ఏపీలోని 26 జిల్లాలతో పాటు తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ర్టాల్లో ఈ ఆలయాల నిర్మాణం కొనసాగుతున్నదని, ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.
శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు దాతల నుంచి రూ.650 కోట్లు విరాళాల రూపంలో సమకూరినట్టు చెప్పారు. సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో 320 ఆలయాల నిర్మాణానికి రూ.32 కోట్ల శ్రీవాణి నిధులు మంజూరు చేశామని వివరించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నామని వివరించారు.