హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తిరుమలలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు చెల్లటం లేదని.. ఏపీ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్‌తో చర్చించి సమస్యను పరిష్కరించాలని శాసనమండలి సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ పక్షనేత మధుసూధనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకునేలా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో మాట్లాడుదామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌తో పాటు, మండలి చైర్మన్‌గా తాను ఏపీ సీఎం, టీటీడీ చైర్మన్‌కు లేఖలు రాశామని, త్వరలో వారితో సమావేశమవుతామని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.
సమస్య సాల్వ్ అయ్యిందిగా? ; పేపర్లో ఎలా వచ్చింది? ‘నమస్తే’ కథనంపై స్పందన
మల్యాల, డిసెంబర్ 16: ‘ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? ప్రజాభవన్‌కు రమ్మంటారా?’ అనే శీర్షికన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం లింగయ్య అనుభవించిన పరిస్థితిపై ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’లో మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సభ్యులు స్పందించారు. ఈ క్రమంలో తనకు ఫోన్ చేసి ‘మీ సమస్యకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పరిష్కారం లభించింది కదా? పరిష్కారం లభించిన 25 రోజుల తర్వాత పేపర్లో కథనాలు ఎలా వచ్చాయి’ అంటూ ప్రశ్నించినట్టు లింగయ్య తెలిపాడు. ఆహార భద్రత కార్డులో తన పేరును ఎలా తొలగించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని వారికి బదులిచ్చినట్టు చెప్పాడు. ఆరోగ్య భద్రత కార్డులో పేరు లేని చాలా మంది నిరుపేదల పరిస్థితి ఏంటని ఎదురు ప్రశ్నించినట్టు తెలిపాడు. తనలాగా ఎవరికీ భవిష్యత్‌లో ఇబ్బంది ఎదురుకాకుండా ఉండాలనే ఆ విషయం పేపర్లో వచ్చింది తప్ప అందులో ఎలాంటి కల్పిత కథనాలు లేవనడంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సభ్యులు ఫోన్ కట్ చేసినట్టు వివరించాడు.