హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో జన్మించలేదని హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ గోవిందానంద సరస్వతి అన్నారు. కర్ణాటక కిష్కింధలోని పంపానది క్షేత్రంలోనే హనుమంతుడు జన్మించారని చెప్పారు. తిరుపతిలో సోమవారం గోవిందానంద సరస్వతి విలేకరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దైవద్రోహం చేస్తున్నదని విమర్శించారు. హనుమంతుని జన్మస్థలం పేరుతో నకిలీ పుస్తకం ముద్రించి స్వాములను, ప్రజలను టీడీపీ మోసగిస్తున్నదని అన్నారు. హనుమంతుని జన్మస్థలం విషయంలో గందరగోళం సృష్టించారని, సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించేవారిని వదలిపెట్టబోమని హెచ్చరించారు. హనుమత్ జన్మతీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టామని, 12 ఏండ్ల పాటు రథం దేశవ్యాప్తంగా తిరుగుతుందని చెప్పారు. కిష్కింధ హనుమంతుని జన్మస్థలమని రథయాత్ర సందర్భంగా ప్రజలకు చెప్తామన్నారు. రూ.1,200 కోట్లతో కిష్కింధ అభివృద్ధిని కర్ణాటక సీఎం ప్రకటించారని గోవిందానంద తెలిపారు.