హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): సామాన్య భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా వీఐపీ భక్తుల తరహాలో శ్రీవారి దర్శనం పొందేందుకు వీలుగా టైం స్లాటెడ్ విధానాన్ని అనుసరించామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తుల తాకిడి పెరగడంతో తలెత్తిన తోపులాట నేపథ్యంలో బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో మీడియాతో మాట్లాడారు. 2016 నుంచి తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్లను టీటీడీ జారీ చేస్తున్నదని అన్నారు. ఈ నెల 9న మూడు రోజుల కోటా పూర్తి కావడంతో టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు.
మంగళవారం ఉదయం 6 గంటలకు, బుధ, గురు, శుక్రవారాలకు సంబంధించి రోజుకు 35 వేల టోకెన్లను జారీచేసే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. గోవిందరాజ స్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద టోకెన్లు జారీ చేసే సమయంలో 20 వేల మంది భక్తులు మాత్రమే ఉన్నారని తెలిపారు. భక్తులు అదే రోజు దర్శన టోకెన్లు పొందాలనే ఆతృత కారణంగా క్యూలైన్లో స్వల్ప తోపులాట జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల విధానాన్ని రద్దు చేసి తిరుమలకు భక్తులను అనుమతించామన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు 4 రోజులపాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టంచేశారు. శ్రీవారి మెట్ల మార్గాన్ని ఏప్రిల్ 30లోపు పునఃప్రారంభిస్తామని చెప్పారు.