హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): డిప్యుటేషన్ల పేరిట టీచర్లను దొడ్డిదారిలో చేసిన బదిలీలను వెంటనే రద్దుచేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావా రవి ఓ సంయు క్త ప్రకటనలో డిమాండ్ చేశారు. పలుకుబడి కలిగిన టీచర్లను డిప్యుటేషన్ల పేరిట జిల్లాలు దాటించడం, బదిలీలు చేయ డం సహేతుకం కాదని పేర్కొన్నారు.
ఇటీవల విద్యాశాఖలో డిప్యుటేషన్ల పేరిట పలువురు టీచర్లను ప్రభుత్వం బదిలీ చే స్తున్నదని, ఏకంగా జిల్లాలకు జిల్లాలు దాటిస్తున్నదని ఆరోపించారు. అనారోగ్యం, భార్యాభర్తలు వంటి సహేతుక కారణాలతో బదిలీలు చేయాలనుకుంటే విధానపరమైన నిర్ణయం తీసుకొని అవసరమైన ఉపాధ్యాయులందరికీ అవకాశం ఇవ్వాలని కోరారు. నిబంధనలు కాదని అస్మదీయులకు కావాల్సిన స్థానాలు కట్టబెడితే ప్రభుత్వం బద్నాం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. డిప్యుటేషన్లను రద్దుచేసి, ఉపాధ్యాయులందరికీ న్యాయం జరిగేలా సాధారణ, అంతర్ జిల్లా బదిలీలను చేపట్టాలని కోరారు.