TSRTC | మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో వరంగల్ రీజియన్‌లోని పలు ప్రాంతాల నుంచి 2,200 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(హైదరాబాద్, కరీంనగర్ జోన్స్) పీవీ మునిశేఖర్ సోమవారం వెల్లడించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో మూడు ప్రాంతాల నుంచి మేడారం జాతరకు 900 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఈ స్పెషల్ బస్సులు ఫిబ్రవరి 13 నుంచి 20వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 1968లో మేడారం జాతరకు 100 స్పెషల్ బస్సులు నడిపినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు స్పెషల్ బస్సుల సంఖ్య 3,845కు చేరిందన్నారు. ప్రత్యేక బస్సుల్లో 21 లక్షల మందిని తరలించే అవకాశం ఉందన్నారు.
మేడారం జాతర వద్ద తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేసినట్లు పీవీ మునిశేఖర్ తెలిపారు. ఆర్టీసీ బస్సులను మాత్రమే జాతర వద్దకు అనుమతిస్తామని, ప్రయివేటు వాహనాలను నార్లపూర్ గ్రామం వరకే అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. జాతర నేపథ్యంలో స్పెషల్ బస్సుల నిర్వహణకు 12,200 మంది ఆర్టీసీ సిబ్బందిని కేటాయించారు. ఇందులో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్‌తో పాటు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఎమర్జెన్సీ సేవల కింద మూడు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రతి బస్సును ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తామని పీవీ మునిశేఖర్ స్పష్టం చేశారు.