ఆర్టీసీ డ్రైవర్లు నిబంధనలు పాటించాలి: ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్, జనవరి 4 : విధుల్లో ఉండే ఆర్టీసీ డ్రైవర్లు అంతా తప్పకుండా డ్రైవింగ్ హ్యాబిట్స్ను పాటించాలని ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీచేశారు. పలువురు డ్రైవర్లు అడ్డగోలుగా బస్సులు నడపటం, అనుమతిలేని హారన్లను మోగిస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు కలుగజేస్తున్నారంటూ సోషల్మీడియాలో ఫిర్యాదులు అందుతుండటంతో సజ్జనార్ స్పందించారు. ఈ మేరకు కొన్ని నిబంధనలు విధిస్తూ వీటిని పాటించేలా చర్యలు తీసుకోవాలని ఈడీలకు సూచించారు. బస్సును పూర్తిగా రోడ్డులో కుడివైపున ఉండేలా నడుపుతుండటంతో కార్లు, ఇతర వాహనాలు ఓవర్టేక్ చేసేందుకు ఇబ్బంది అవుతుంది అని వచ్చిన ఫిర్యాదు మేరకు బస్సులను పూర్తిగా కుడివైపు నడపవద్దని ఆదేశించారు. నిషేధిత ఎయిర్ హారన్లు, మల్టీటోన్ హారన్లు వాడొద్దని, రోడ్డు మధ్యలో ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం.. దింపడం చేయవద్దని స్పష్టంచేశారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినాటి నుంచి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రయాణికుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. దీంతో ట్విట్టర్లో ఆయన ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ‘వీసీ సజ్జనార్ ఐపీఎస్ ఎండీ టీఎస్ఆర్టీసీ ఆఫీస్’ పేరిట ఉన్న అధికారిక ట్విట్టర్ ఖాతాకు మంగళవారంతో ఫాలోవర్స్ సంఖ్య 50 వేలకు చేరింది.