హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు వినూత్న సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికి మరో నూతన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకొనేందుకు ‘టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్’ యాప్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది. పండుగ సందర్భంగా సీటు రిజర్వేషన్ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతోపాటు బస్ ట్రాకింగ్ లింక్‌ను సందేశ రూపంలో పంపుతున్నారు. లింక్‌పై క్లిక్ చేయగానే సంబంధిత బస్సు ఎకడుందో సులువుగా తెలుసుకోవచ్చు. టీఎస్ఆర్టీసీ బస్‌ట్రాకింగ్ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నది. www.tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతోపాటు అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలుసుకోవచ్చు. బస్సు బ్రేక్‌డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం తదితర వివరాలను ప్రయాణికులు ఈ యాప్‌లో నమోదు చేయవచ్చు.
ప్రస్తుతం రిజర్వేషన్ చేసుకొనే 1,800 టీఎస్ఆర్టీసీ బస్సులకు ‘బస్ ట్రాకింగ్’ సదుపాయం కల్పించాం. పండుగ సందర్భంగా ప్రయాణికులకు అసౌకర్యం కలుగొద్దనే ఉద్దేశంతో వారి ఫోన్లకు బస్సు ట్రాకింగ్ లింక్‌ను సందేశ రూపంలో పంపిస్తున్నాం. త్వరలో హైదరాబాద్ సిటీ బస్సులకు ఈ సదుపాయం కల్పిస్తాం.
-బాజిరెడ్డి గోవర్ధన్, వీసీ సజ్జనార్-ఆర్టీసీ చైర్మన్, ఎండీ