హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): సర్వీస్ రూల్స్ ప్రకారమే అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో ఏఈ, టీవో, జేటీవో పోస్టులను భర్తీ చేయాలని డిప్లొమా ఇంజినీర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం 833 ఏఈ/ టీవో/జేటీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ఆయా పోస్టులకు డిప్లొమా ఇంజినీర్లే అర్హులని పేర్కొన్నారు. కానీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో డిప్లొమాతో పాటు బీటెక్ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారని అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఇంజినీర్లకు సంబంధించి 1,540 ఏఈఈ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టిందని గుర్తుచేశారు. రెండు పోస్టుల్లోనూ గ్రాడ్యుయేట్ ఇంజినీర్లకు లబ్ధి చేకూరనున్నదని వివరించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సర్వీస్ రూల్స్ ప్రకారమే ఏఈ పోస్టులను భర్తీ చేయాలని, లేదంటే ఏఈ/ఏఈఈ పోస్టులను 3ః1 నిష్పత్తిలో బీటెక్, డిప్లొమా ఇంజినీర్లతో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు