హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని తెలుగు మీడియం అభ్యర్థుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సరికొత్త ఆలోచన చేస్తున్నది. కమిషన్కు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుగుభాషలోనూ అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందుకోసం కమిషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ప్రకటించిన ఉద్యోగాలకు ప్రభుత్వం వయోపరిమితిని పెంచింది. తెలుగు మీడియంలో, దూరవిద్యలో చదువుకొన్నవారు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. వారు ఇంగ్లిష్ అర్థంచేసుకోలేక ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో కమిషన్ వెబ్సైట్ సహా, సమస్త సమాచారాన్ని తెలుగులోను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నది. త్వరలోనే తెలుగులో సమాచారం అందుబాటులోకి వస్తుందని కమిషన్ అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఉద్యోగ సమాచారం పత్రికను సైతం తెలుగులో తీసుకురావాలని కమిషన్ అధికారులు భావిస్తున్నారు.