హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గ్రూప్-1లో తొలి ఘట్టం ముగిసింది. ప్రిలిమినరీ పరీక్ష సజావుగా సాగింది. 503 పోస్టులకు మొత్తం 2,86,051 మంది పరీక్ష రాశారు. ఆదివారం పరీక్ష జరగగా.. వెంటనే ఓఎంఆర్ షీట్లను పటిష్ఠ బందోబస్తు నడుమ హైదరాబాద్ తరలించారు. ఈసారి అందరికీ ఓఎంఆర్ షీట్లను అందుబాటులో తెచ్చేందుకు టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ ప్రారంభించింది. రోజుకు సగటున 40 వేల ఓఎంఆర్ షీట్లు స్కాన్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వారం రోజుల్లో వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్లు అప్లోడ్ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. మొత్తం 2,86,051 మంది ప్రిలిమ్స్ రాయగా, వారి ఓఎంఆర్ షీట్లను https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. వెంటనే ప్రిలిమ్స్ కీ విడుదల చేస్తారు. అభ్యంతరాలు తెలిపేం దుకు అవకాశం ఇవ్వనున్నారు. నెలరోజుల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించాలని సమాచారం.