TSPSC | అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టకరమైన వాతావరణంలో మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను అరికట్టేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 30లక్షల మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ విధానాన్ని యూపీఎస్సీ కూడా ప్రశంసించిందన్నారు. యూపీఎస్సీకి 2వేల మంది ఉద్యోగులు ఉంటారని తెలిపారు. ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు సగటున ఏటా 4వేల ఉద్యోగాలు భర్తీ చేసేవారని చెప్పారు. తెలంగాణ వచ్చాక దాదాపు 35వేల ఉద్యోగాల భర్తీ అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రస్తుతం 25వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చామని, అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎక్కడాలేని విధంగా మల్టిపుల్ జబ్లింగ్ పద్ధతిని అనుసరించామన్నారు. 500 గ్రూప్-1 పోస్టులకు దాదాపు 2.87లక్షల మంది రాశారని చెప్పారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు, సమాధానాలు మల్టిపుల్ జంబ్లింగ్ పద్ధతిని తీసుకువచ్చామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమాలు జరగొద్దనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష అనంతరం అభ్యంతరాల స్వీకరణకు 5 రోజులు సమయం ఇచ్చామన్నారు. నిపుణులను సంప్రదించిన తర్వాత గ్రూప్-1 ఫైనల్ కీ ఇచ్చినట్లు చెప్పారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ వడపోత పరీక్ష మాత్రమేనని, అందుకే మార్కులు ఇవ్వట్లేదన్నారు. పరీక్షల నిర్వహణలో మానవ ప్రమేయాన్ని సాధ్యమైనంతగా తగ్గించామన్నారు.
ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 26 నోటిఫికేషన్లు ఇచ్చామని, ఇందులో ఏడు పరీక్షలు పూర్తయ్యాయన్నారు. ఎనిమిదో పరీక్షగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ జరుగాల్సి ఉందన్నారు. 173 పోస్టులకు 33వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 12న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. 11న పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు. కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరో హ్యాక్ చేసి, దుర్వినియోగం
చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆ తర్వాత రెండు రోజులు విచారణ జరిపి, తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌కు ఐపీ అడ్రెస్లు తెలిసే అవకాశం ఉందని, ఆయన ఆరేడు సంవత్సరాలుగా పని చేస్తున్నారన్నారు. రాజశేఖర్ కీలక సమాచారం యాక్సెస్ చేసినట్టు భావిస్తున్నామని, రాజశేఖర్ సాయంతో ఏఎస్ఓ ప్రవీన్ పేపర్లు సంప్రదించాడని, ప్రవీణ్.. రూ.10 లక్షల కోసం పేపర్లు విక్రయించినట్లు తెలిసిందన్నారు.
అత్యవసర పరిణామాల నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నా కుమార్తె గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిందని, ప్రిలిమ్స్‌లోనూ ఎంపికైనట్లు వదంతులు వచ్చాయన్నారు. అయితే, తన పిల్లలు ఎవరూ గ్రూప్1 ప్రిలిమ్స్ రాయలేదని స్పష్టం చేశారు. వదంతులకు హద్దులు అంటూ ఉండాలన్నారు. తాను పుట్టింది మహబూబ్నగర్లోనేనని, చదువుకున్నది రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనేనని తెలిపారు. తన ఇద్దరు పిల్లలు పరీక్ష రాయలేదని, వారు రాస్తానంటే నేను టీఎస్పీఎస్సీ పోస్టు నుంచి తప్పుకుంటానని చెప్పానన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నత స్థాయిలో చాలా ప్రాంతాల్లో పని చేశానన్నారు. తెలంగాణ పిల్లలకు న్యాయం చేసేందుకు బాధ్యతగా పని చేస్తున్నానని, ప్రభుత్వం ఇచ్చిన కర్తవ్యాన్ని బాధ్యతగా నెరవేరుస్తున్నానన్నారు.
ఏఈ పరీక్షపై రేపు నిర్ణయం తీసుకుంటామని, పరీక్షపై ఇంకా నివేదిక రావాల్సి ఉందన్నారు. ప్రవీణ్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనన్న ఆయన.. 103 మార్కులు మాత్రమే అత్యధికం కాదన్నారు. అయితే, పరీక్షల్లో విజేతలు కాని వారు కోర్టులకు వెళ్లడం సాధారణమేనన్న ఆయన, తమ సమయం సగం కోర్టు కేసులకే సరిపోతుందన్నారు. పోలీసులు లీకేజీ కేసుపై చాలా వేగంగా స్పందించారని, లీకేజీలో ప్రమేయం ఉన్న ఐదుగురి ఉద్యోగాలు పోతాయని స్పష్టం చేశారు. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, రేణుక భర్త ఉద్యోగాలు పోతాయన్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక వాస్తవం తెలుస్తుందన్న ఆయన.. కమిషన్‌లో నమ్మిన వాళ్లే గొంతు కోశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గ్రూప్-1 మెయిన్స్ జూన్ 5 నుంచే యధాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.