G- SAT | హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులేని చర్యల వల్ల జీ-శాట్ 16 ప్రసారాలు శాశ్వతంగా నిలిచిపోనున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేయూ బ్యాండ్ జీ -శాట్ 16 శాటిలైట్ సేవల కోసం ఎంవోయూ పునరుద్ధరణ సకాలంలో పూర్తి కాకపోవడంతో సిగ్నల్స్‌ను నిలిపివేస్తున్నట్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈనెల 5న జీ-శాట్‌కు శాటిలైట్ సేవల పునరుద్ధరణ విషయంలో ఒప్పందం చేసుకోవాలని లేఖ రాసింది. 10 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఐటీ శాఖ దీనిపై పట్టించుకోకపోవడమే కారణంగా తెలుస్తున్నది.
టీ-శాట్ నెట్వర్క్ చానెల్స్‌కు సీఈవో నియామకం విషయంలో సంబంధిత శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కినుక వహించారని, ఈ క్రమంలోనే ఆయన ఎంవోయూ పునరుద్ధరణకు ఆసక్తి చూపడంలేదనే ప్రచారం సాగుతున్నది. రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత టీ-శాట్‌ను పునరుద్ధరించింది. నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని, సీఈవోగా సీనియర్ జర్నలిస్టు శైలేశ్‌రెడ్డి సారథ్యంలో దాదాపు పదేండ్లపాటు ఉద్యోగార్థులు, విద్యార్థులకు ‘నిపుణ’, ‘విద్య’ అని రెండు చానెళ్లను కొనసాగాయి.
టీ -శాట్ నెట్వర్క్ చానల్స్ ప్రసారాలకు ఎటువంటి ఇబ్బంది లేదని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. జీ శాట్ 8 సిగ్నల్‌లో విద్య, నిపుణ చానల్స్ ప్రసారాలు యాథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. జీ-శాట్ టెస్ట్ సిగ్నల్ మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరలో కొత్త జీ -శాట్ 16 ఒప్పందం చేసుకుంటామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.