TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఉందని.. అలాగే సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది.
గోవా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు-పడమర ద్రోణి బలహీనపడిందని పేర్కొంది. ఈ క్రమంలో రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే పలుచోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 22 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.