TS Weather | రాష్ట్రంలో చలితీవ్ర పెరుగుతున్నది. రాత్రి సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఈశాన్య, ఉత్తర దిశ నుంచి రాష్ట్రంలోకి చలిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గాలుల ప్రభావంతో చలి పెరుగుతున్నదని పేర్కొంది. అలాగే, పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మరో వైపు హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16.6 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మల్కాజ్‌గిరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. శేరిలింగంపల్లిలో 12.1, రాజేంద్రనగర్‌లో 12.6 డిగ్రీలు నమోదైందని తెలిపింది. రామచంద్రపురం, పటాన్‌చెరువులో 12.8, సికింద్రాబాద్, చందానగర్, కుత్బుల్లాపూర్‌లో 14, ఆదిలాబాద్‌లో 15, మెదక్ 13.4, పటాన్చెరువు 13.8, రామగుండం 17.7 డిగ్రీలుగా రికార్డయ్యాయని వాతావరణశాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో చలితీవ్రత పెరుగుతుందని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.