హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్ టెస్ట్ (పీఈసెట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, శాతవాహన వర్సిటీ ఇంచార్జి వీసీ నరేంద్ర మోహన్ ఈ ఫలితాలను వెల్లడించారు. 96.49శాతం అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలిపారు.
పీఈసెట్ ద్వారా బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సులో ప్రవేశాలకు 1,650 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో 1,198 మంది పరీక్షలకు హాజరు మొత్తం 1,198 (96.49శాతం) మంది క్వాలిఫై అయ్యారు. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీ డీపీఈడీ) కోర్సులో ప్రవేశాలకు 742 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో 507 మంది పరీక్షలకు హాజరుకాగా, 489 మంది (96.45శాతం) అర్హత సాధించారు. ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, కార్యదర్శి వెంకటేశ్, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ మదన్మోహన్, పీఈసెట్ కన్వీనర్ రాజేశ్‌కుమార్ ఉన్నారు.
సత్తా చాటిన అమ్మాయిలు
పీఈసెట్ ఫలితాల్లోనూ అమ్మాయిలే సత్తా చాటారు. బీపీఈడీ, యూజీ డీపీఈడీ రెండింటి టాప్ -10 ర్యాంకుల్లో 9 ర్యాంకులను అమ్మాయిలే కైవసం చేసుకొన్నారు. బీపీఈడీలో గొల్ల మహేశ్వరి టాపర్‌గా నిలువగా, సీహెచ్ పద్మశ్రీ, తెల్లం ప్రియాంక, గుగులోతు అఖిల, జూకంటి రంజిత, జానపాటి శ్రీవిద్య, కొండ భవాని, బీ మౌనిక, ఆత్రం గీతాంజలి టాప్ 10 ర్యాంకులను కైవసం చేసుకోగా, వీరిలో సుమంత్ మాత్రమే అబ్బాయి కావడం విశేషం. యూజీ డీపీఈడీలో చట్టిమల్ల సంధ్య టాపర్‌గా నిలువగా, నగ్మా, అంజలి, జంగుబాయి, అఖిల, కుసుమ, రాజేశ్వరి, శిరీష, సోని టాప్ -10 ర్యాంకులను దక్కించుకొన్నారు. వీరిలో ఒక్క అబ్బాయి జైపాల్ మాత్రమే ర్యాంకు సాధించారు.
సీట్లు ఎక్కువ.. క్వాలిఫయర్లు తక్కువ
ఇంజినీరింగ్, లా, ఎంబీఏ, ఎంసీఏ ఇలా ఏ కోర్సును తీసుకున్నా సీట్లు తక్కువగా ఉండి.. క్వాలిఫై అయ్యేవారు ఎక్కువగా ఉంటారు. కానీ, బీపీఈడీ, యూజీ – డీపీఈడీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ రెండు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్‌లో క్వాలిఫై అయిన వారు తక్కువగా ఉండగా, కాలేజీల్లో సీట్లు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 14 బీపీఈడీ కాలేజీలుండగా, వీటిల్లో 1,365 సీట్లున్నాయి. ఇక మరో మూడు డిప్లొమా కోర్సులను నిర్వహించే కాలేజీలుంటే వీటిల్లో 300 సీట్లున్నాయి. మొత్తంమీద 17 కాలేజీల్లో 1,665 సీట్లుంటే, ఈ ఏడాది పీఈసెట్‌లో కేవలం 1,645 మంది అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే అందరూ కాలేజీల్లో చేరినా 20 సీట్లు మిగలనుండటం గమనార్హం.