TS LAWCET | హైదరాబాద్ : టీఎస్ లాసెట్, పీజీఎల్సెట్కు దరఖాస్తులు భారీగా పెరిగాయి. దీంతో టీఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు సెషన్లలో కాకుండా మూడు సెషన్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తుల సంఖ్య పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జూన్ 3వ తేదీన ఉదయం 9 నుంచి 10.30 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి రెండు సెషన్లలో మూడేండ్ల లా కోర్సు దరఖాస్తుదారులకు, చివరి సెషన్లో ఐదేండ్ల లా కోర్సు, పీజీఎల్సెట్కు దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. రూ. 2 వేల ఆలస్య రుసుంతో ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను 20 నుంచి 25వ తేదీ మధ్యలో ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు.