Gurukula Teachers | హైదరాబాద్, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): ‘కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం. సీఎం రేవంత్రెడ్డి, ప్రభు త్వ పెద్దలు సత్వరమే స్పందించి 4నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలి. మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో’ అం టూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయు లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదేండ్లపాటు గత బీఆర్ఎస్ ప్రభు త్వం సైతం ప్రతినెలా 10వ తేదీ లోపునే వేతనాలు అందించిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల హామీలతో ప్రజలను వంచించినట్టే తమను సై తం ఇబ్బందులకు గురిచేస్తున్నదని వాపోతున్నారు. తమకు వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా, విద్యార్థుల మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు, కాంట్రాక్టర్ల బిల్లులను కూడా చెల్లించడం లేదని, దీంతో కాంట్రాక్టర్లు కూరగాయలు, గుడ్లు, ఫుడ్ ప్రొవిజన్స్ ఇవ్వడం లేదని వెల్లడించారు. పాఠశాలలు మూతపడి పేద విద్యార్థులు నష్టపోయే రో జులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.