హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ) : బీటెక్ సహా వృత్తి విద్యా ఫీజులపై నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సిద్ధమైంది. ఇందుకు ఇంజినీరింగ్ సహా పలు కోర్సుల ఫీజులను సవరించాలని నిర్ణయించింది. ఈ ఏడాదికి పాత ఫీజుల వర్తింపు నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 2022-23, 2023-24, 2024-25 మూడు విద్యాసంవత్సరాల ఫీజులను ఈ ఏడాదిలోనే సవరించాలని నిర్ణయం తీసుకొన్నది.
ఈ మేరకు కాలేజీల వారీగా ఫీజుల ఖరారుపై టీఏఎఫ్ఆర్సీ పునర్విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా టీఏఎఫ్ఆర్సీ ఆడిటర్లు.. కాలేజీలు సమర్పించిన నివేదికను పునఃపరిశీలిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ఫీజులను సవరించరాదని, పాత ఫీజులనే కొనసాగించాలని టీఏఎఫ్ఆర్సీ గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై కాలేజీలు కోర్టుకెళ్లడంతో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఏఎఫ్ఆర్సీ తాజా నిర్ణయం తీసుకొన్నది.
గందరగోళానికి తావివ్వరాదనే..
2023-24 నుంచి కొత్త బ్లాక్ పీరియడ్ ప్రారంభించాల్సి ఉన్నది. ఇందుకు మళ్లీ కాలేజీల వారీగా ఈ ఏడాది నవంబర్ నుంచి పునర్విచారణ చేపట్టాలి. ఇది వచ్చే ఏడాది ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై ప్రభావం పడుతుందని, దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులను గందరగోళానికి గురవుతారనే వాదనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం నుంచి కూడా ఇదే తరహా సంకేతాలు అందటంతో టీఏఎఫ్ఆర్సీ అధికారులు మూడేండ్లకుగాను ఫీజుల సవరణకు కాలేజీల వారీగా పునర్విచారణ ప్రారంభించారు. ఈ నెలాఖరులోపు ఫీజులపై విచారణను పూర్తిచేస్తామని టీఏఎఫ్ఆర్సీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆయా ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఫీజులను ఖరారుచేస్తూ ప్రభుత్వం జీవోను జారీచేస్తుందని పేర్కొన్నారు. ఆయా ఫీజులు ఈ విద్యాసంవత్సరం కూడా అమలవుతాయని స్పష్టం చేశారు.