హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఎండల తీవ్రత నేపథ్యంలో మంగళవారం నుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలను ఒక్కపూట మాత్రమే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సోమవారం ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు అన్ని ఈ ఆదేశాలను చివరి పనిదినం వరకు పాటించాలని సూచించారు. డీఈవోలు, ఆర్జేడీలు ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడులు ఉదయం ఎనిమిదింటికి ప్రారంభమై, మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు 12:30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనం పెట్టాలని ఆదేశాలిచ్చారు. టెన్త్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఎస్సెస్సీ విద్యార్థులందరికీ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాల్లో పేర్కొన్నారు. పరీక్షలు మొదలయ్యే వరకు వీటిని జరుపాలని సూచించారు.