హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): విద్యుత్తుసంస్థల్లో అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా) అమల్లో ఉన్నందున ఆర్టిజన్లు చేపట్టే సమ్మె చట్టవిరుద్ధమని, సర్వీసు నిబంధన 34(20) ప్రకా రం ఇది మిస్ కండక్ట్‌గా పరిగణిస్తామని, కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌కో,జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు హెచ్చరించారు. రాష్ట్ర విద్యుత్తుసంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏప్రిల్ 15న విద్యుత్తుసంస్థల్లో పనిచేసే అన్ని తరగతుల ఉద్యోగసంఘాలతో వేతన ఒప్పందం చేసుకున్నామని, కార్మికసంఘాల అభ్యర్థన మేరకు ఆర్టిజన్లకు కూడా సహేతుకమైన వేతన సవరణ ఇచ్చామని ఆయన తెలిపారు. అయినా.. కొందరు ఆర్టిజన్లు, కార్మికసంఘాలు వేతన సవరణ సరిపోలేదన్న సాకుతో 25వ తేదీ నుంచి సమ్మెకు పిలుపు ఇచ్చినట్టు మేనేజ్మెంట్ దృష్టికి వచ్చిందని చెప్పారు.
సోమవారం ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. విద్యుత్తుసంస్థల్లో పనిచేసే వేలాది మందిని ఆర్టిజన్లుగా గుర్తించి పే స్కేళ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సహృదయతను ఈ సందర్భంగా సీఎండీ గుర్తుచేశారు. విద్యుత్తుసంస్థల్లో సమ్మె నిషేధం అమల్లో ఉన్నదని, ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొంటే సర్వీసు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి హెచ్చరించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఉన్నతాధికారుల నుంచి తీసుకునే సెలవు, ముందస్తుగా అనుమతి తీసుకున్న సెలవులు మినహాయించి ఆర్టిజన్లు ఎవరు కూడా సెలవుల్లో వెళ్లకూడదంటూ ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు సంబంధించి అన్ని డివిజన్లు, సర్కిళ్ల హెడ్లకు సూచిస్తూ.. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు విధులకు గైర్హాజరైన ఆర్టిజన్లకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. ఒకవేళ విధులకు గైర్హాజరైతే తక్షణం ఉద్యోగంలోకి తొలగించాలనికూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించారు. విధుల్లోకి హాజరుకాని ఆర్టిజన్ల విషయంలో ఉద్యోగంలోంచి తొలగించే ప్రొఫార్మాను కూడా దీనికి జతచేశారు.
విద్యుత్తు ఆర్టిజన్ ఉద్యోగులపై అధికారులు ఎస్మా ప్రయోగించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుపై ఏడుగురు ఉద్యోగులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైఫాబాద్ పీఎస్ పరిధిలో ఆర్టిజన్ ఉద్యోగులు శంకర్, శివశంకర్, పంజాగుట్ట పీఎస్ పరిధిలో సాయిలు, నవీన్, వినోద్, సుభాష్, సత్యనారాయణ సమ్మెకు పిలుపునిస్తూ ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఎస్మా యాక్ట్ కింద అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.