హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఎడ్‌సెట్, పీఈసెట్ సీట్ల భర్తీకి వెబ్‌కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన సెట్ కమిటీ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి షెడ్యూల్‌ను విడుదల చేశారు. 19న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, 20 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 9న ఎడ్‌సెట్, అక్టోబర్ 3న పీఈసెట్ సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ 30 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఎస్కే మహమూద్, వీ వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాస్‌రావు, అడ్మిషన్స్ కన్వీనర్ రమేశ్ బాబు పాల్గొన్నారు. ఎడ్‌సెట్ ద్వారా బీఈడీ, పీఈ సెట్ ద్వారా డీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లోని సీట్లను భర్తీచేస్తారు.
ఎడ్‌సెట్‌లో 17,550, పీఈసెట్‌లో 2,110 సీట్లు
ఎడ్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా బీఈడీ కోర్సులో ఈ ఏడాది 17,550 సీట్లను భర్తీచేస్తారు. వీటిని పూర్తిగా కన్వీనర్ కోటాలో నింపుతారు. రాష్ట్రంలో 198 బీఈడీ కాలేజీలుండగా, వీటిల్లో 17,550 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులైన బీపీఈడీ, యూజీ – డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్‌కు 2,865 దరఖాస్తులు రాగా, 1,769 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,707 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక బీపీఈడీ, యూజీ – డీపీఈడీ కోర్సుల్లో 21 కాలేజీల్లో, 2,110 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సీట్లు ఎక్కువగా ఉండటంతో క్వాలిఫై అయిన వారందరికి సీట్లు దక్కే అవకాశాలున్నాయి. ఇక ఎడ్‌సెట్‌లో మహిళలే అధికంగా క్వాలిఫై కాగా, ప్రవేశాలు పొందేవారు లేకపోవడంతో ఇందులో సీట్లు ఏటా మిగులుతున్నాయి.
