హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): పలు ప్రవేశ పరీక్షల (సెట్స్) కన్వీనర్ల పేర్లను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి శుక్రవారం ప్రకటించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ నోటిఫికేషన్‌ను మార్చిలో విడుదలచేసి, జూన్, జూలైలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. మిగతా ప్రవేశ పరీక్షల తేదీలను సైతం వీలైనంత త్వరగా నిర్ణయించాలని యోచిస్తున్నారు. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూ ప్రొఫెసర్ గోవర్ధన్‌ను నియమించారు. రాష్ట్రంలో మొత్తంగా 7 సెట్లు నిర్వహిస్తుండగా, ఈసెట్‌కు మాత్రమే కొత్త కన్వీనర్‌ను నియమించారు. 5 సెట్లకు పాతవారినే ఖరారుచేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈసెట్) కన్వీనర్ పేరును ఇంకా నిర్ణయించలేదు. పాలిటెక్నిక్ పూర్తిచేసినవారికి ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఈసెట్ నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూకే అప్పగించగా, కన్వీనర్‌గా ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌ను నియమించారు. ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతను ఉస్మానియాకు అప్పగించగా, కన్వీనర్‌గా ప్రొఫెసర్ రామకృష్ణ వ్యవహరించనున్నారు. ఐసెట్ నిర్వహణ బాధ్యతను కాకతీయ వర్సిటీకి అప్పగించగా, కన్వీనర్‌గా ప్రొఫెసర్ కే రాజిరెడ్డికి అవకాశం కల్పించారు. లాసెట్, పీజీలాసెట్ నిర్వహణ బాధ్యతను ఉస్మానియాకు అప్పగించగా, కన్వీనర్‌గా ప్రొఫెసర్ జీబీ రెడ్డిని నియమించారు. ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎం ఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ నిర్వహణ బాధ్యతను ఉస్మానియాకు అప్పగించగా, కన్వీనర్‌గా లక్ష్మీనారాయణ వ్యవహరించనున్నారు.