TS EAMCET | హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ బీ ఫార్మసీ, ఫార్మ్ డీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కోర్సులకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగింది. ఫస్ట్ ఫేజ్‌లో 97.92 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఏడు యూనివర్సిటీలు, ఒక ప్రభుత్వ కాలేజీ, 72 ప్రయివేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయని అధికారులు పేర్కొన్నారు. బీ ఫార్మసీలో 97.52 శాతం, ఫార్మ్ డీలో 99.92, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీలో 100 శాతం సీట్లు నిండాయి. మొత్తం 9,362 సీట్లు ఉండగా, ఫస్ట్ ఫేజ్‌లో 9,168 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 194 సీట్లు మిగిలి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
సీట్లు పొందిన విద్యార్థులు వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్న ఫీజును క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్ అవుతుంది. అయితే ట్యూషన్ ఫీజు చెల్లించే విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే.. రీఫండ్ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 14వ తేదీ లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. లేనియెడల సీటు క్యాన్షిల్ అవుతుంది.