హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరంలో వచ్చే నెలలో జరుగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్’ (ప్రపంచ ఆర్థిక సదస్సు)కు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. జనవరి 14 నుంచి 19 వరకు జరిగే ఈ సమ్మిట్‌లో ఆయనతోపాటు ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా పాల్గొననున్నారు.
తెలంగాణలో ఉన్న అవకాశాలపై సీఎం అక్కడ ప్రసంగించనున్నట్టు తెలిసింది. రాష్ర్టానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. వారి వెంట ఆర్థిక, ఐటీ శాఖ అధికారుల బృందం వెళ్లనున్నది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి తొలి విదేశీ పర్యటన ఇదే. ఇదే సదస్సుకు ఏపీ నుంచి ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నట్టు తెలిసింది.