గద్వాల, అక్టోబర్ 19 : కంటెయినర్లో తరలిస్తున్న దాదాపు రూ.750 కోట్ల నగదును చెక్‌పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. విచారణ తరువాత ఆ నగదు ఆర్బీఐ నుంచి వచ్చినట్టు వెల్లడికావడంతో వదిలేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేరళ నుంచి హైదరాబాద్‌కు కంటెయినర్లో నగదు తరలిస్తుండగా.. మంగళవారం రాత్రి పుల్లూరు చెక్‌పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి వెంటనే అధికారులను ఆదేశించడంతో ఆర్డీవో, లీడ్‌బ్యాంక్ మేనేజర్, డీఎస్పీతోపాటు సంబంధిత శాఖల అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. కంటెయినర్లో వచ్చిన నగదుకు సంబంధించిన పత్రాలు చూపిన తర్వాత యూబీఐతోపాటు ఎస్ఎల్బీసీ నోడల్ అధికారి, ఆదాయ పన్ను శాఖ అధికారులతో మాట్లాడి.. రిజర్వ్ బ్యాంక్ ద్వారా వచ్చిన నగదుగా గుర్తించారు. అనంతరం పోలీస్ ఎస్కార్ట్ సాయంతో నగదును గమ్యస్థానానికి చేర్చినట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఆ డబ్బు ఎంత అనేది అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలో మాత్రం రూ.750 కోట్లుగా వైరల్ అయింది.