చిగురుమామిడి, అక్టోబర్ 27: నల్లగొం డ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. మఠాధిపతులు, పీఠాధిపతులు మధ్యవర్తిత్వం వహించి ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్లకు కొనుగోలు చేసేందుకు రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఉప ఎన్నిక సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నామని, నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్పందన వస్తున్నదని చెప్పారు. భారీ మెజారిటీ ఖాయమన్నారు.