హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై టీఆర్ఎస్ లోకసభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆధ్వర్యంలో శుక్రవారం సికింద్రాబాద్‌లోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహించిన 74వ రైల్వే జోనల్ వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో నామా పాల్గొన్నారు. రైల్వేలకు సంబంధించిన హామీలు, ఇతర ప్రధాన సమస్యల పరిష్కారం మాటేమిటని నిలదీశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా తెలంగాణ బిడ్డలకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న హామీని కేంద్రం బుట్టదాఖలు చేయడంపై ధ్వజమెత్తారు. కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం తన మొండి వైఖరిని మార్చుకొని కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమిని సేకరించి రైల్వే బోర్డుకు ఇచ్చిందని, ఆ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పాలు, కూరగాయలు, పండ్లు తదితర నిత్యావసర వస్తువులతో రైళ్లలో ప్రయాణించే చిరు వ్యాపారాలకు పాస్‌లు ఇవ్వాలని కోరారు. ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం రైల్వే స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, సీసీ టీవీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డివిజినల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు, రైల్వేశాఖ ప్రత్యేక క్యాటగిరీ కింద నామినేట్ చేసిన ఆరుగురు సభ్యులు, 41 మంది జడ్‌ఆర్‌యూ సభ్యులతోపాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రిన్సిపల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేసన్లు, రిజిస్టర్డ్ ప్యాసింజర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో సరిగా కేటాయింపులు జరపలేదని ఎంపీ నామా ధ్వజమెత్తారు. ఏండ్లు గడుస్తున్నా భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణం కార్యారూపం దాల్చడం లేదని విమర్శించారు. కొత్త రైల్వే లైన్లు, నూతన డివిజన్ ఏర్పాటు, బుల్లెట్ రైలు, హైస్పీడ్ రైల్వే లైన్ తదితర ప్రాజెక్టుల విషయంలోనూ తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందన్నారు. ప్రధాన రైల్వే మార్గాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సమంజసం కాదన్నారు.