హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27వ తేదీన మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 27న ఉదయం 10 గంటల వరకు హెచ్ఐసీసీకి చేరుకోవాలని పార్టీ ప్రతినిధులందరికీ సీఎం సూచించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గంతో పాటు లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కోఆర్డినేటర్లు, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాల, మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు.
ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పార్టీ ప్రతినిధుల పేర్ల నమోదు కార్యక్రమం కొనసాగనుంది. ఉదయం 11:05 గంటలకు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకుని, పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం స్వాగతోపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షులు కేసీఆర్ మాట్లాడుతారు. దాదాపు 11 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. తీర్మానాలను చర్చించి ఆమోదం తెలుపనున్నారు.