హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పథకంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. పథకం అమలు తీరు, సభ్యుల సంఖ్య పెరుగుదలకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సోమవారం లోక్‌సభలో నామా ప్రశ్నించారు. అటల్ పెన్షన్ యోజన పథకం నిధుల వివరాలు వెల్లడించాలని కోరారు.
ఈ పథకానికి కేంద్రం ఏ మేరకు నిధులు సమకూరుస్తున్నదో తెలపాలని, ఐదేండ్లుగా రాష్ర్టాలకు కేటాయించిన నిధుల వివరాలు కావాలని కోరారు. 2021, 2022, 2023లో పథకానికి ప్రభుత్వ కోకంట్రిబ్యూషన్ నిధులు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. పెన్షన్, ఆస్తుల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఉద్దేశించిన గ్యాప్ఫండ్కు కూడా నిధులు కేటాయించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తున్నదని విమర్శించారు.
కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరాద్ సమాధానమిస్తూ.. సభ్యులు ఎంచుకున్న ఆధారంగా కనీస హామీ పెన్షన్‌ను అందిస్తున్నట్టు తెలిపారు. పథకానికి సంబంధించిన కోకంట్రిబ్యూషన్ నిధులు, బ్యాంకులకు ప్రోత్సాహక చెల్లింపులు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ర్టాల వారీగా సమగ్ర సమాచారం ఇవ్వకపోవడంపై ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.