హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ‘దళితబంధును కేంద్ర ప్ర భుత్వం దేశమంతా అమలు చేయాలి’ అని టీఆర్ఎస్ 21వ ప్లీనరీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రతిపాదిస్తూ.. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా దళితులు స్వశక్తితో ఎదిగేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్ సబ్కా సాథ్.. సబ్కా వికాస్‌లో దళితులకు స్థానమెక్కడ? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మరో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ దళితబంధు అమలుపై ఆలోచించాలని కోరారు.