హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 24: ‘కవ్విస్తే.. ఖబడ్దార్.. బీజేపీ నాయకుల్లారా! చిల్లర రాజకీయాలు చేయొద్దు.. రెడ్డీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం. పోతిరెడ్డిపేటలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయ్’ అని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదలచేశారు. ‘ఆదివారం హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్ నాయకులను కలువడానికి వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ నాయకులు ఆయన వాహనం దగ్గరికి వెళ్లారు. అప్పటికప్పుడు ప్లాన్ ప్రకారం.. రెడ్డి జేఏసీ పేరిట మంత్రికి వినతిపత్రం అందజేస్తూ, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని నినాదాలు చేశారు. మార్చి బడ్జెట్లో నిధులు కేటాయించి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తానని మంత్రి హామీ ఇచ్చినా, ఊరుకోలేదు. లొల్లి చేయడానికే వచ్చారని మంత్రి గ్రహించి, వారిని శాంతింపజేసే ప్రయత్నంచేసినా, పట్టు విడువకుండా నినాదాలు చేయడంతో గ్రామస్థులు వచ్చి కొత్త ముఖాలను గుర్తించి, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారని నిలదీయడంతో జారుకున్నారు. వాళ్లు వచ్చి గొడవ సృష్టించినట్టు రాజ్‌న్యూస్ చానల్ జరిగిన తతంగాన్ని ఒక పథకం ప్రకారం చిత్రీకరించింది.
ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు’ అని వివరించారు. రెడ్డీల మధ్య చిచ్చు పెట్టి ఈటల ఓట్లు రాబట్టుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి చెందిన ఇతర ప్రాంతాల నాయకులు మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడితే బుద్ధిచెప్తామని హెచ్చరించారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులతో మళ్లీ ఏమైనా పిచ్చివేషాలు వేసేందుకు యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దిరెడ్డి హెచ్చరించారు. మరికొన్ని చోట్ల ఇలాంటి అల్లరి మూకలు గొడవ సృష్టించే అవకాశాలున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.
వాళ్లది మా ఊరు కాదు
మా పోతిరెడ్డిపేట గ్రామానికి వచ్చి, రెడ్డి జేఏసీ అని హరీశ్‌రావు మందు ప్లకార్డులు ప్రదర్శించిన వాళ్లు మా గ్రామం కానేకాదు. వాళ్లను నేను నియోజవర్గంలో కూడా ఎప్పుడు చూడలేదు. కావాలనే ఉద్దేశంతో ఓ టీవీ చానల్‌ను తీసుకొచ్చి, గొడవ చేయడానికి ప్రయత్నించారు. మా గ్రామస్థులు అక్కడి చేరుకునే సరికి పారిపోయారు. వాళ్లు ఎక్కడి వాళ్లు అని ఆరా తీయగా, హైదరాబాద్ నుంచి వచ్చిన బీజేపీ వాళ్లని తెలిసింది.
గుండాయిజం చేయటానికి వచ్చారు
ఎక్కడి నుంచో వచ్చి మా గ్రామంలో గూండాయింజం చేయడానికి వచ్చారు. రెడ్డీలం అందరం ఐక్యతతోనే ఉన్నాం. మాకు హరీశ్‌రావు సార్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుచేస్తానని ఎన్నడో హామీ ఇచ్చారు. రెడ్డీల మధ్య గొడవలు లేపడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తరిమేస్తాం. ఈటల ఓటమి భయంతోనే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన గూండాలతో ఇలాంటి అరాచకాలు చేయిస్తున్నారు. మా గ్రామానికి వచ్చి ప్లకార్డులు పట్టుకున్న వాళ్లు అసలు మా రెడ్డి కులస్థులు కానే కాదు.