
చంకన బిడ్డ.. చిటికెన వేలుపట్టుకుని కొడుకు.. కాళ్లకు స్లిప్పర్లు.. బేలచూపుతో తెలంగాణభవన్లోకి అడుగుపెట్టింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన బోయ ధనలక్ష్మి. నల్లగొండ జిల్లా నేరెడ గ్రామానికి చెందిన పోలోజు స్రవంతితోపాటు పిల్లలు, ఇతర కుటుంబసభ్యులతో వచ్చిన మరో 50 మందిదీ అదే పరిస్థితి. వారంతా ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబసభ్యులు. ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్యకర్తల కుటుంబసభ్యులను స్థానిక నేతలు తెలంగాణభవన్‌కు తోడ్కొని వచ్చారు. భోజనం పెట్టించి.. రూ. 2 లక్షల ప్రమాద బీమా ఆర్డర్ కాపీలను అందజేసి బేరచూపుతో వచ్చినవారికి భరోసా కల్పించి.. సాదరంగా ఇంటికి పంపించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కార్యకర్తలు, వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీఆర్ఎస్ నేతలు భరోసా ఇచ్చారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు గురువారం తెలంగాణభవన్‌లో రూ.2 లక్షల ప్రమాదబీమా ఆర్డర్ కాపీలను అందజేశారు. 50 మంది కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్, సీనియర్ నేత పర్యాద కృష్ణమూర్తి పత్రాలను పంపిణీచేశారు. అన్నిజిల్లాల నుంచి బాధిత కుటుంబాలను పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలంగాణభవన్‌కు తీసుకొనివచ్చారు. పిల్లాపాపలతో వచ్చినవారికి అక్కడే ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత పర్యాద కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఇంటియజమాని ప్రమాదవశాత్తు మృతిచెందటం విషాదకరమని.. అయితే దానినే తలుచుకొని దిగులు చెందకుండా ధైర్యంగా ముందుకెళ్లాలని తెలిపారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ఎం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఏ రాజకీయపార్టీ చేయనివిధంగా టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాకుంటున్నదని ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ తెలిపారు. రూ.2 లక్షల ప్రమాదబీమా వర్తింపజేసి ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 425 కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను అందజేశామని.. మరో 425 క్లెయిమ్‌లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.
కేసీఆర్ రుణం తీర్చుకోలేం
నా భర్త లింగస్వామి ప్రింటింగ్ప్రెస్ల పనిచేయగా.. నేను కూలిపనికి పోయేది. లారీ ప్రమాదంలో ఆయన చనిపోయిండు. ఎంపీటీసీతోపాటు, ఇంకా చానామంది వచ్చి.. ‘మీ ఆయన టీఆర్ఎస్ పార్టీల తిరిగిండు. పార్టీ సభ్యత్వం కట్టిండు. మీరు అధైర్యపడకండి’ అని చెప్పిన్రు. గట్లనే అంటరు అటెంక ఎవలూ రారని అనుకున్నం. కానీ, ఇక్కడ రూ.2లక్షల ఆర్డర్ కాపీ ఇచ్చిండ్లు. సీఎం కేసీఆర్ రుణం ఎన్నటికీ తీరదు. సార్‌ను ఎప్పటికీ మతిలపెట్టుకుంటం.
పార్టీ మమ్ములను ఆదుకున్నది
మాది నల్లగొండ చిట్యాల మండలం నేరడ గ్రామం. భర్త నారాయణచారి రోడ్డు యాక్సిడెంట్ల చనిపోయిండు. ఇద్ద రు పిల్లలు. ఏ ఆదెరువు లేదు. ఇయ్యాల్రేపు పదివేల సహాయం చేస్తే వెయ్యో రొండు వేలో ఎవలకన్న ఇయ్యాలె అంటరు. కానీ మమ్ములను ఎవలూ ఒక్కపైస అడగలేదు. నా భర్త మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలనే తిరిగేది. పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు పార్టే ఇప్పుడు మమ్ముల ఆదుకున్నది.
ఉపాధి చూపిస్తమన్నరు
మాది ఇల్లందు దగ్గర వెంగళరావునగర్. మా ఆయన విజయ్‌కుమార్ ప్లంబింగ్ పనిచేసేది. నాకు ఇద్దరు అమ్మాయిలు. రోడ్డు యాక్సిడెంట్లో మా వారు చనిపోయారు. భూముల్లేవు. జాగాల్లేవు. నేను ఎంబీఏ చదువుకున్న. మొన్నటిదాకా హౌజ్వైఫే. ఇప్పుడేదన్నా పనిచేయాలె. పార్టే ఆదుకున్నది. ఇప్పుడు రూ.2 లక్షల ఆర్డర్‌కాపీ ఇచ్చింది. ఉపాధి కోసం ఏదైనా పని ఇప్పిస్తమని అన్నరు. ధైర్యం వచ్చింది.