హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో గురువారం కాంగ్రెస్ మూకల చేతలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయారెడ్డిపై ట్రోలింగ్ మొదలైంది. వారిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ అనుకూలురు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు తెరతీశారు. ఫోన్లు చేసి వేధించేందుకు ప్రయత్నించారు. ఎక్స్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ తదితర మాధ్యామాల ద్వారా వేధింపులకు పాల్పడ్డారు. సరిత ఫోన్ నంబర్‌ను గ్రూపుల్లో పెట్టి ఫోన్లు చేయించారు. కొందరు మిస్డ్ కాల్స్ ఇస్తే, మరికొందరు ఫోన్లు చేసి తిట్టారు. ఇంకొందరు వాట్సాప్‌లలో మెసేజ్‌ల ద్వారా బెదిరించే ప్రయత్నం చేశారు.
సరిత పాత ఫొటోలు, వివిధ సోషల్ మీడియా గ్రూపులను జల్లెడపట్టి మరీ వెతికి ఆమెపై బురదజల్లే ప్రయత్నం చేశారు. 2018లో ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక గ్రూపునకు అడ్మిన్‌గా ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నదంటూ రీల్స్, మీమ్స్ చేశారు. కొందరు కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియా ప్రతినిధులు సరిత ‘ఎక్స్’ఖాతాలో తిట్లదండకం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి సరితను ట్రోల్ చేశారు. వరుసగా 4-5 ట్వీట్లు, రీట్వీట్లు చేశారు. సరిత ఫోన్ నంబర్‌ను కూడా సోషల్ మీడియాలో పెట్టారు. ‘రేవంతన్న సైన్యం’ ‘అప్నా హస్తం’ ‘గీత అయినాల’ ‘తానోస్’ ‘మీ కాపలా కుక్క’ ‘లప్పాలిటిక్స్’ తదితర పేర్లతోపాటు మరికొన్ని బినామీ పేర్లతో ఉన్న ఖాతాల నుంచి మరికొందరు సరిత, విజయపై ట్రోల్స్ చేశారు.
విజయారెడ్డి, సరిత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, వారిని మానసికంగా వేధించేలా కొన్ని వీడియోలు రూపొందించారు. అన్యమత ప్రచారానికి వెళ్లినందునే కొండారెడ్డిపల్లి గ్రామస్థులు వెళ్లగొట్టారని కామెంట్లు పెట్టారు. తమపై సినిమా పాటలతో కొన్ని వీడియోలు చేశారని, వేధింపులంటూ సరిత, విజయారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినా ట్రోలింగ్లు ఆగలేదు. పైగా కొండారెడ్డిపల్ల్లికి వచ్చి రేవంతన్నతో పెట్టుకుంటే ఇలాగే అవుతుందంటూ ఫోన్లు చేసి వేధించారు.
తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను డీజీపీ జితేందర్ దృష్టికి సరిత తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్చార్జి సామా రామ్మోహన్‌రెడ్డి తన పేరు, తన ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని ఫిర్యాదు చేశారు. డీజీపీ, సైబర్ క్రైం పోలీసులు తక్షణం దీనిపై స్పందించాలని, తగిన చర్య తీసుకోవాలని ఎక్స్ వేదికగా విజ్ఙప్తి చేశారు.