ఖమ్మం, ఫిబ్రవరి 11: మహిళలపై జరుగు తున్న ట్రోలింగ్‌ను అరికట్టేందుకు ప్రజాస్వామికవాదులు, లౌకికవాద శక్తులంతా ఒక్కటై ఉద్యమించాలని ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక (ప్రరవే) ప్రధాన కార్యదర్శి, రచయిత్రి మల్లీశ్వరి పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని వేదిక కల్యాణ మండపంలో ప్రరవే ఏడో మహాసభల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ‘మహిళలపై ట్రోలింగ్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు.
సమాజంలో ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ, వాటిని విశ్లేషిస్తూ ప్రరవే అక్షరబద్ధం చేస్తున్నదని అన్నారు. సోషలిస్ట్ భావాలు ఉన్న వారు కూడా మహిళలను ట్రోలింగ్ చేయడం దారుణమని అన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. వాస్తవాలను మాట్లాడే వారిని కొందరు పనిగట్టుకుని మరీ ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు.
ప్రజాగాయని విమలక మాట్లాడుతూ.. ట్రోలింగ్‌ను ఎదుర్కోవాలంటే ప్రజాస్వామిక వాదలంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ప్రరవే జాతీయ కోశాధికారి రామలక్ష్మి సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. తర్వాత రచయిత్రి కాత్యాయనీ విద్మహే రచించిన నవలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రచయిత్రులు శిలాలోలిత, శీలా సుభద్రాదేవి, ఎండ్లూరి మానస తులసి చందు, మెర్సీ మార్గరెట్, స్వేచ్ఛ, అరుణ గోగులమండ, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు ప్రసేన్, యాంకర్ ఉదయభాను, హేతువాది బైరి నరేశ్ పాల్గొన్నారు.