హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు అగ్గి రాజుకుంటున్నది. ట్రిపుల్ ఆర్ పేరిట వేలాది ఎకరాలు సేకరించే క్రమంలో పెద్దల కోసం ఆలైన్మెంట్ మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాల పొట్టలుగొట్టే ప్రణాళికలకు కాంగ్రెస్ సర్కారు ఊతమిస్తున్నది. ఆగస్టు నెలాఖరున హెచ్ఎండీఏ అధికారిక వెబ్సైట్లో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ వివరాలను యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని వివిధ మండలాల్లోని గ్రామాల్లో ఉన్న భూముల సర్వే నంబర్ల వివరాలతో ప్రభుత్వం ప్రచురించింది. దీంతో హెచ్ఎండీఏ జాబితాలో సర్వే నంబర్లను చూసిన రైతులు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించారు. అన్ని జిల్లాల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. జీవనాధారమే లేకుండా పోతుందని కడుపుమండిన వేలాది మంది రైతులు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కులను పరిరక్షించుకునేలా నిరసలు, ఆందోళనలకు దిగారు. తాజాగా సోమవారం ప్రజావాణికి ప్రాజెక్టునే వ్యతిరేకిస్తూ ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు వినతిపత్రాలను అందజేశారు. ఆయా జిల్లాల నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న వందలాది మంది రైతులు అమీర్‌పేట స్వర్ణజయంతిలోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ఈ ప్రభావం దాదాపు ఐదారు కిలోమీటర్ల మేర వ్యాపించింది.
ఊరూరా ఉద్యమాలు
వివిధ మండలాల పరిధిలోని ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగుతున్నారు. తమ పొట్టగొట్టే ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని వివిధ గ్రామాల రైతులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కేశంపేట్, తలకొండపల్లి, ఆమన్‌గల్లు, ఫరూక్నగర్, కొందుర్గు తదితర మండలాలకు చెందిన రైతులు నిరసనలు వ్యక్తంచేశారు. కొత్త ఆలైన్‌మెంట్‌ను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రోడ్డుతో తమకు వ్యవసాయమే లేకుండా పోతుందని, ఉపాధి లేక వలస పోయే పరిస్థితులు వస్తాయంటూ చిన్న, సన్నకారు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎన్కేపల్లి, మన్నెగూడ, గొంగుపల్లి, పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు, కెరవెళ్లి, సిరిగాయపల్లి, మంచన్‌పల్లి, మరియపూరు, గట్టుపల్లి, తుర్క ఎన్కేపల్లి గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ఆందోళనలో పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్ కోసమే రింగు రోడ్డు వంకర
రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల భూముల కోసమే రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును ఇష్టారీతిన వంకర, టింకర తిరుగుతుందంటూ రైతులు ధ్వజమెత్తారు. ఆమనగల్లు మండల కేంద్రంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. పాత ఆలైన్మెంట్ మార్పును నిరసిస్తూ హైదరాబాద్-శ్రీశైలం హైవేపై మండల పరిధిలోని మాలేపల్లి, పోలేపల్లి, సింగంపల్లి, సంకటోనిపల్లి రైతులు సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. కేశంపేట రైతులు జిల్లా కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాల రైతులు ఇచ్చిన పిలుపుతో దాదాపు 500 మంది రైతులు హైదరాబాద్ అమీర్‌పేట్ హెచ్ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడిలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున జరిగిన మెరుపు ఆందోళనతో పోలీసులకే అంతుచిక్కలేదు. అమీర్‌పేట్ నుంచి ఐదారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచింది. పెద్ద ఎత్తున రైతులు రావడంతో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులే అక్కడి నుంచి జారుకున్నారు.