బాసర, మార్చి 20 : తమ కూతురు తేజస్విని మృతికి ట్రిపుల్ఐటీ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ఐటీ పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న తేజస్విని ఈ నెల 16న హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో లుకేమియా వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కళాశాల అధికారులు తెలిపారు. తేజస్విని మృతికి సంతాపకంగా శుక్రవారం సాయంత్రం బాసర ట్రిపుల్ఐటీ కళాశాల విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తేజస్విని తల్లిదండ్రులు, బంధువులు రాగా వారిని సె క్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు గేటు ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా తేజస్విని తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురుకు ఎలాం టి వ్యాధి లేదని, బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా)తో చనిపోయిందని అబద్ధాలు చెప్తున్నారని వాపోయారు. యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యంతోనే సకాలంలో సరైన వైద్యం అందక మృతి చెందిందని అన్నారు. ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
యాజమాన్యంపై ఫిర్యాదు చేస్తామని పోలీసులే తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. ప్రభుత్వ దవాఖాన వైద్యులు ధ్రువీకరించిన మెడికల్ రిపోర్టుల ప్రకారం తేజస్విని మృతికి లుకేమియా (బ్లడ్ క్యాన్సర్ 4వ స్టేజీ) కారణమని ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.