హైదరాబాద్, ఏప్రిల్7 (నమస్తే తెలంగాణ): గిరిజన యువతకు ఇప్పటికే మంజూరైన ట్రైకార్ రుణాలు రూ.219 కోట్లను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను సోమవారం ముట్టడించింది. ఈ ముట్టడిని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ గిరిజన సంఘాల జేఏసీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. అయినప్పటికీ పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి వందలాది మంది గిరిజన నేతలు, కార్యకర్తలు, లబ్ధిదారులు తరలివచ్చి సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టడంతో జేఏసీ నేతలు అక్కడే ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరాంనాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రామ్మూర్తి, రమావత్ అంజయ్యనాయక్, లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్‌నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు దాస్‌రాంనాయక్, ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ రఘు, గిరిజన జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వినోద్‌నాయక్ మాట్లాడుతూ.. ట్రైకార్ రుణాలు రూ.219 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రవేశపెట్టి ట్రైకార్ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. ట్రైకార్ ద్వారా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు వీలుండగా, ప్రభుత్వం రాజీవ్ యువవికాసం పేరిట రుణాలను గరిష్ఠంగా రూ.4లక్షలకే పరిమితం చేసిందని ధ్వజమెత్తారు. తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. వారి హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.