Telangana | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): అటవీ ఉత్పత్తులు, సొంతంగా తయారు చేసిన వస్తువుల విక్రయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థను పట్టించుకునే నాథులు లేకుండా పోయారు. కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం సంస్థ బలోపేతానికి మాత్రం చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడవుల నుంచి సేకరించే ఉత్పత్తులతో పాటు స్వయంగా తయారు చేసిన వస్తువుల మార్కెటింగ్‌ను మాత్రం గిరిజన సంక్షేమశాఖ మంత్రి, అధికారులు గాలికి వదిలేశారని అడవిబిడ్డలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 30కి పైగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసింది. ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్‌ను పట్టించుకోవడం లేదని సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు. కార్పొరేషన్‌కు నిధులు లేకపోవడం వల్ల ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం ఏటా రూ.30 కోట్ల నుంచి 40 కోట్ల నిధులు విడుదల చేస్తే కార్పొరేషన్ బలోపేతం సాధ్యమవుతుందని, లేకపోతే సంస్థను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గిరిజన సహకార సంస్థ పరిధిలో జీసీసీ చైర్మన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 280 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారి జీతాల కోసం ప్రభుత్వం ఏటా దాదాపు రూ.30 కోట్ల వరకు వెచ్చిస్తున్నది. కానీ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటున్నది. ప్రభుత్వం సహకరిస్తూ, సంస్థ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని, మార్కెటింగ్ పరంగా చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్‌నాయక్ డిమాండ్ చేశారు. కార్పొరేషన్‌ను బలోపేతం చేసి, అటవీ ఉత్పత్తులు ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.