అశ్వారావుపేట రూరల్, ఫిబ్రవరి 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో భూ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 15లోపు పరిష్కరించకుంటే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
శనివారం ఆ గ్రామంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. సర్వే నంబర్లు 30, 36, 39ల్లో ఉన్న భూములను గిరిజనులు ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల అటవీశాఖ అధికారులు వచ్చి సాగు పనులను అడ్డుకుంటున్నారని, ఈ విషయమై ఐటీడీఏ, కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
గత సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తే అక్టోబర్లో జాయింట్ సర్వే చేశారని, కానీ పంచనామా చేయలేదని పేర్కొన్నారు. తమ వద్ద పట్టాపాసు పుస్తకాలు ఉన్నప్పటికీ అధికారులు బెదిరిస్తున్నారని వాపోయారు. మార్చి 16న ‘రామన్నగూడెం గ్రామ పంచాయతీ ఆదివాసీల ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.