Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని చల్లగిద్దా తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గంజాయి మొక్కలను ధ్వంసం చేశారని పోలీసులపై తండా వాసులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
చల్లగిద్దా తండాలో గంజాయి సాగు చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇవాళ ఉదయం తండాకు చేరుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పత్తి చేనులో గంజాయి మొక్కలు కనిపించగా, వాటిని పోలీసులు ధ్వంసం చేశారు.
ఈ క్రమంలో పోలీసులపై తండా వాసులు దాడికి దిగారు. రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా పోలీసుల సెల్ఫోన్లను తండా వాసులు లాక్కున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న నారాయణఖేడ్ డీఎస్పీ పోలీసు బలగాలతో చల్లగిద్దా తండాకు చేరుకున్నారు.