బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 02:47:15

పట్నంలో ఆదివాసీ పల్లె పరిమళం

పట్నంలో ఆదివాసీ పల్లె పరిమళం

  •  వీరి ప్రత్యేకత చాటేలా మ్యూజియం
  • సంస్కృతి, జీవన విధానాన్ని తెలిపే ఘట్టాలు
  • భవిష్యత్‌ తరాలకు గిరిజన చరిత్ర తెలిసేలా ఏర్పాట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చెట్టు కింద పంచాయితీ.. ఆ పక్కనే గుడిసెలు, పెద్ద వృక్షాలు.. గడ్డపారతో మట్టి తవ్వుతున్న మనుషులు.. కాస్త ముందుకు వెళ్తే సమ్మక్క, సారలమ్మ గద్దెలు.. గోడల నిండా మనుషుల బొమ్మలు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం విశేషాలివీ. అడవి పల్లె ప్రత్యేకతలను, ఆదివాసీల జీవన విధానాన్ని, సంస్కృతిని పట్నం ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది. 2003లోనే స్థాపించిన ఈ గిరిజన మ్యూజియంలో అధికశాతం ఏపీకి చెందిన గిరిజన తెగలకు సంబంధించిన విశేషాలే ఉండేవి. 2014లో తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోని గిరిజనుల జీవితాలను ప్రజలకు ప్రముఖంగా తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రూ.1.50 కోట్లతో మ్యూజియాన్ని ఆధునీకరించింది. మాసబ్‌ ట్యాంక్‌ సంక్షేమభవన్‌ ప్రాంగణంలోని ఈ గిరిజన మ్యూజియంలో ఆదివాసీల చరిత్ర, వారసత్వాన్ని తెలియజేసే ప్రదర్శనలు ఉన్నాయి. గోండి, కోయ, ఎరుకల, లంబాడా, ఆంద్‌, కోలం, చెంచులు, కొండరెడ్లు, ఇతర తెగలకు సంబంధించిన సంస్కృతి, ఆహారం, జీవనశైలి, వారి నమ్మకాలను సూచించేలా బొమ్మలకు రూపాన్నిచ్చారు. గుడిసెలు, హస్తకళలు, కళాఖండాలు, త్రీడీ శిల్పాలతోపాటు, మట్టి, వెదురు, గడ్డితో తయారు చేసిన పలు గ్యాలరీలు ఉన్నాయి. అక్కడి ప్రజలు ఉపయోగించే వ్యవసాయోపకరణాలు, మట్టి పాత్రలు తదితర వస్తువులను ఉంచారు. గోడలు గిరిజన వాతావరణాన్ని పోలిన చిత్రాలను కలిగి ఉన్నాయి. ఇక్కడ 80 సీట్లతో మినీ థియేటర్‌ను కూడా ఏర్పాటుచేశారు.  సందర్శకులకు గిరిజనులపై లఘుచిత్రాలను ఇందులో ప్రదర్శిస్తారు. 

 గిరిజన సంస్కృతి పరిరక్షణే లక్ష్యం

తెలంగాణకు చెందిన గిరిజనుల కళ, సంస్కృతి పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకనుగుణంగా ప్రత్యేకంగా మ్యూజియాన్ని ఏర్పాటుచేసి వారి చరిత్రను భవిష్యత్‌ తరాలకు తెలియజేసేందుకు కృషి చేస్తున్నాం. మ్యూజియంలోకి అడుగు పెట్టాక అడవిలోని గిరిజనవాడలో తిరుగుతున్న భావన కలుగుతుంది. రాష్ట్రంలోని అన్ని తెగల జానపద, జీవనశైలి, ఆచారాలు, సామాజిక ఆచారాలు ఒకేచోట ప్రదర్శనగా ఏర్పాటుచేశాం. గిరిజన గ్యాలరీ, కోయ గ్యాలరీ, మేడారం జాతర గ్యాలరీ, సమ్మక్క, సారలమ్మ దేవతల విగ్రహాలు, మేడారంలోని పరిసరాలను మ్యూజియంలో చూడొచ్చు.  

- డీ సత్యనారాయణ,  మ్యూజియం క్యూరేటర్‌