మహబూబాబాద్ రూరల్, జూన్ 9 : గిరిజన భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు బోడ రమేశ్‌నాయక్, భూక్యా శ్రీను డిమాండ్ చేశారు. సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతులు నిరసన తెలిపి, అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహబూబాబాద్ మండల శివారులోని శనిగపురం రోడ్లో 275, 279 సర్వే నంబర్లోని 30 ఎకరాల గిరిజన రైతుల భూమిని అగ్రవర్ణానికి చెందిన కొందరు పెద్దలు ఆక్రమించారని ఆరోపించారు.
రెవెన్యూ, మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో భవనాలు నిర్మించి విద్యాశాఖ నుంచి పర్మిషన్ లేకుండానే ప్రారంభించినట్టు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి పర్మిషన్ లేని స్కూల్‌ను రద్దు చేయాలని, పూర్తి విచారణ చేసి గిరిజన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.