హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ముఖ్య శాఖల్లో ఒకటైన రవాణా శాఖపై సీఎం రేవంత్ దృష్టిపెట్టారా? ఖజానా నింపుకొనేందుకు ఈ శాఖనే లక్ష్యంగా చేసుకొన్నారా? ప్రభుత్వం ఒకవైపు ఇసుక మా ఫియాకు సపోర్ట్ చేస్తూనే, మరోవైపు రవాణా శాఖకు టార్గెట్లు పెట్టి వేధిస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు రవాణాశాఖ అధికారులు. ప్రభుత్వం రవాణా శాఖ అధికారుల ప్రాణాలను పణంగాపెట్టి.. ఆ వసూళ్లతో ఖజానా నింపుకోవాలని చూస్తున్నదని మండిపడుతున్నారు. టార్గెట్ల పేరుతో రవా ణా శాఖ అధికారులను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నదనే విమర్శలున్నాయి. 10 రోజులుగా తనిఖీల పేరిట మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్లకు టార్గెట్లు పెట్టిన ప్రభుత్వం.. అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా తనిఖీలు చేయాలనే ఆదేశాలొస్తున్నాయని చెప్తున్నారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధంచేసినట్టు వాపోతున్నారు.
రవాణా శాఖ అధికారులపై.. ప్రభుత్వం, ఆ శాఖను శాసించే ఓ షాడో టార్గెట్లు ఇస్తున్నట్టు ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తగ్గడంతో దానిని ఏదోవిధింగా నింపుకొనేందుకు అధికారులకు నిద్రాహారాలు దూరం చేశారని అంటున్నారు. ప్రతినెలా తనిఖీలకు ప్రత్యేక టార్గె ట్లు పెట్టి, ఆ బాధ్యతను కొందరు అధికారులకు అప్పగించి, ఆ వచ్చిన నగదు ప్ర భుత్వ ఖాతాలో జమ చేసే బాధ్యతలను ఇంకొందరు ఉన్నతాధికారులకు ఇచ్చినట్టు చెప్పుకొంటున్నారు. ఈ వరుస తనిఖీలతో తమకు నిద్ర కరువైందని, సరిగా తిండి తినలేకపోతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక మా ఫియాకు, క్వారీల మాఫియాలకు సపోర్ట్ చేస్తూనే.. రవాణా అధికారులకు విచ్చలవిడిగా టార్గెట్లు పెడుతున్నారని అధికారులు వాపోతున్నారు. ఈ టార్గెట్లను చేరుకొనే క్రమంలోనే భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ వెంకన్న విధుల్లో ప్రమాదానికి గురై దుర్మరణం చెందారని చెప్తున్నారు.
ప్రభుత్వం అనధికారికంగా విధించిన రూ.8,500 కోట్ల టార్గెట్లను రీచ్ కావడానికే అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్తున్నారు. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల జారీ, పన్నుల వసూళ్లు, వా హనాలు నిబంధనల ఉల్లంఘనలు, స్టిక్కరింగ్ వంటి పనుల్లో అధికారులంతా నిమగ్నమయ్యారని చెప్తున్నారు. ఓవర్లోడ్, ఫిట్నెస్ వంటి విషయాలను తీవ్రంగా పరిగణి స్తూ.. జిల్లాల్లో అధికారులకు కంటి మీద కునుకులేకుండా తనిఖీలు చేయిస్తున్నారని అంటున్నారు. ఏటేటా రవాణా శాఖ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతూ వస్తున్నది. 2024-25లో రవాణా శాఖకు రూ.6,910.90 కోట్లు ఆదాయం వసూ లు కాగా, 2025-26లో రూ.7,097.38 కోట్లు వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని మరింత పెంచాలని, రూ.8,500 కోట్లకుపైగా ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించాలని ప్రభుత్వం టార్గెట్లు పెట్టడంతో.. దానిని సాధించడం కోసం ప్రాణత్యాగాలు చేయాల్సి వస్తున్నదని అంటున్నారు.