హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అక్రమ వసూళ్లకు కేంద్రాలుగా మారిన రవాణాశాఖ చెక్‌పోస్టులను తక్షణం మూసివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. చెక్‌పోస్టులను బుధవారం సాయంత్రం నుంచే ఎత్తివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రవాణాశాఖపై సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి అవినీతికి కేరాఫ్‌గా ఉన్న చెక్‌పోస్టులను ఎత్తివేయాలని రవాణాశాఖ మంత్రి, కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా రవాణా అధికారులు (డీటీఓ) స్వయంగా చెక్‌పోస్టుల వద్ద ఉన్న బోర్డులను, బారికేడ్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు. చెక్‌పోస్టుల వద్ద విధుల్లో సిబ్బంది ఎవరూ లేకుండా తక్షణమే ఉపసంహరించాలని ఆదేశించారు. ఈ తొలగింపు ప్రక్రియను మొత్తం వీడియో తీసి దాన్ని భద్రపరచాలని పేర్కొన్నారు. చెక్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి, కంప్యూటర్లు, ఇతర వస్తువులను తక్షణం డీటీఓ కార్యాలయాలకు తరలించాలని, అలాగే పరిపాలన రికార్డులు డీటీవో కార్యాలయంలో భద్రపరచాలని ఆదేశించారు.