కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : సర్పంచ్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తానంటూ ఓ ట్రాన్స్‌జెండర్‌ను ప్రత్యర్థి బెదిరించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ సాధన (సంతోష్) నామినేషన్ వేశారు. ఈమె నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని మొదట ఒత్తిడి తెచ్చారు. సాధన భయపడకుండా నామినేషన్ విత్‌డ్రా చేసుకోలేదు. అధికారులు ఆమెకు గుర్తు కూడా కేటాయించారు. దీంతో సాధన ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారాన్ని చేయడం ప్రారంభించగా, ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది.
ఇది జీర్ణించుకోలేని ప్రత్యర్థి ఆమెను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రచారం కోసం అంటించిన పోస్టర్లు, బ్యానర్లను చింపివేస్తున్నారని, ఎన్నికలో ప్రచారం చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని సాధన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రత్యర్థి నుంచి వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి జైనూర్ ఎస్సైకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. ఆయన తననే తిట్టి పంపించారని ఆరోపించారు. తనను చంపుతామని బెదిరించిన ప్రత్యర్థి అభ్యర్థి ఫోన్‌కాల్స్ రికార్డులు తనవద్ద ఉన్నాయని సాధన పేర్కొన్నారు. తనను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.